Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 88-3
సంపుటము: 1-431
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
సహజాచారములెల్లా సర్వేశ్వరుని యాజ్ఞే
అహమించి నమ్మకుండు టదియే పాషండము
॥సహజా॥
నిద్దిరించువాని చేతి నిమ్మపంటివలెనే
చద్దికర్మములు తానే జారితే జారె
పొద్దువొద్దు తనలోన భోగకాంక్ష లుండఁగాను
అద్దలించి కర్మ మొల్లననుటే పాషండము
॥సహజా॥
కలగన్నవాడు మేలుకని నటువలెనే
తలగి ప్రపంచ మెందో దాఁగితే దాగె
యిల నీ దేహము మోఁచి యింతాఁ గల్లలనుచు
పలికి తప్పనడచే భావమే పాషండము
॥సహజా॥
ధర నద్దము చూచేటి తన రూపమువలె
గరిమతో దన యాత్మ కంటేఁ గనె
సరుస శ్రీవేంకటేశు సాకార మటు గని
కరఁగి భజించలేని కష్టమే పాషండము
॥సహజా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము