Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 88-5
సంపుటము: 1-433
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
హరి నీ యనుమతో అది నా కర్మమో
[1]పరమే యిహమై భ్రమయించీని
॥హరి॥
కలుగుదు శాంతము కటకట బుద్ధికి
చలమున నింతాఁ జదివినను
నిలువదు చిత్తము నీపై చింతకు
పలుసంపదలనుఁ బరగినను
॥హరి॥
తగులదు వైరాగ్యధన మాత్మకును
వొగి నుపవాసము లుండినను
అగపడదు ముక్తి ఆసలనాసల
జగమింతా సంచరించినను
॥హరి॥
విడువదు జన్మము వివేకముననే
జడిసి స్వతంత్రము జరపినను
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే
బడిఁ గాచితి విదె బ్రదికితి నేను
॥హరి॥

[1] ‘ఇహమే పరమై’ అనుట న్యాయ్యమేమో?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము