అధ్యాత్మ సంకీర్తన
రేకు: 88-6
సంపుటము: 1-434
రేకు: 88-6
సంపుటము: 1-434
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఇందిరాధిపుని సేవ యేమరకుండుట గాక బొందితోడి జీవులకు బుద్ధు లేఁటిబుద్ధులు | ॥ఇందిరా॥ |
| రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు బాయట నిద్రాదేవి పలుమారును చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి మాయజీవులకు నెల్లా మని కేఁటిమనికి | ॥ఇందిరా॥ |
| కనురెప్ప మూసితేనే కడు [1]సిష్టే చీఁకటౌను కనురెప్ప దెరచితే క్రమ్మరఁ బుట్టు ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె యెనయు జీవుల కింక యెఱు కేఁటియెఱుక | ॥ఇందిరా॥ |
| వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట యెప్పుడు [2]లోనివెలికి నెడతాఁకును అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు | ॥ఇందిరా॥ |
[1] ‘సృష్టే’ కావచ్చు.
[2] ‘లోనికి వెలికి’ అని ద్వంద్వము కావచ్చు.


