Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 89-1
సంపుటము: 1-435
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
దేవ యీ తగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా
॥దేవ॥
తనువున బొడమిన తతి నింద్రియములు
పొనిగి [1]యెక్కడికిఁ బోవునయా
పెనఁగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేఁగుదురయ్యా
॥దేవ॥
పొదుగుచు మనమున బొడమిన యాసలు
అదన నెక్కడికి నరుగునయా
వొదుగుచు జలములనుండు మత్స్యములు
పదపడి యేగతి బాసీనయ్యా
॥దేవ॥
లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా
బలు శ్రీవేంకటపతి నా యాత్మనుఁ
గలిగితి వెక్కడి కలుషములయ్యా
॥దేవ॥

[1] ‘యక్క’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము