Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 89-4
సంపుటము: 1-438
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు
దూపిలి తలఁచినా దోషహరము
॥ఆపద్బంధు॥
గరుడని నెక్కిన ఘనరేవంతుఁడు
[1]గరుడకేతనముగల రథుఁడు
గరుడఁడే తనకును గరియగు బాణము
గరిమె నీతఁడేపో ఘనగారుడము
॥ఆపద్బంధు॥
పాముపరపుపై బండిన సిద్ధుడు
పాముపాశముల పరిహరము
పామున నమృతముఁ పడఁదచ్చినతఁడు
వేమరు నీతఁడే విషహరము
॥ఆపద్బంధు॥
కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును
కమలాదేవికిఁ గైవశము
అమరిన శ్రీవేంకటాధిపు డితఁడే
మమతల మాకిదే మంత్రౌషధము
॥ఆపద్బంధు॥

[1] ‘గరుడకేతనము గల’వరకు ఆభాసబహువ్రీహి. దానిపై ‘రథ’శబ్దముతో బహువ్రీహి. ఇది వింత. గరుడుని కేతనముగాగల రథము గలవాడు అని భావమా? లేక గరుడుని కేతనముగ రథముగ గలవాడనియా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము