అధ్యాత్మ సంకీర్తన
రేకు: 89-6
సంపుటము: 1-440
రేకు: 89-6
సంపుటము: 1-440
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| పెరుగఁ బెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టు బుద్ధెఱిఁగితే, మరులు మఱచితేనే యిన్నిటి గెలిచే మర్మము సుండీ జ్ఞానులకు | ॥పెరుగ॥ |
| జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారి తనరఁ గౌపీనకటిసూత్రముల [1]తగులము లేనిది గంబరి తనుఁ దా నెఱఁగడు యెదిరి నెఱఁగఁడు తత్వధ్యానాలయనిర్మలచిత్తుఁడు పెనఁగే కోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీఁడివో యమ్మా | ॥పెరుగ॥ |
| నిద్దురవొయ్యేటి[2]యప్పుడు దేహి నిత్యవిరక్తునివంటి ఘనుఁడు బుద్ధి సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లఁడు వొద్దనే యేపనులకుఁ జేయఁబోఁడు వున్న లంపటాల కేమియుఁ జొరఁడు కొద్దిలేని యాస యెందువోయనొకో కోపమేమి లేదు వీఁడివో యమ్మా | ॥పెరుగ॥ |
| హరి శరణన్నయప్పుడు దేహి అమరులకంటే కడునధికుఁడు పరము నిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా వచ్చు గరిమ శ్రీవేంకటేశుఁడు వీఁడివో కానరైరిగా యిన్నాళ్లమ్మా | ॥పెరుగ॥ |
[1] ‘తగులమి’ రేకు.
[2] ‘యెప్పుడు’ రేకు.


