Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-1
సంపుటము: 1-441
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం[1]
ఉన్న విచారములేల వోవో సంసారులాల
యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో
॥ఉన్న॥
తక్కక బ్రహ్మలఁ గన్నతండ్రిఁ గొలిచి మీరు
యెక్కువ సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరు
చొక్కి మీమీ దంపతులు సుఖమున నుండరో
॥ఉన్న॥
భవరోగవైద్యుని పాదములు సేవించి
భువి రోగములఁ బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు తానైనవానిఁ
గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో
॥ఉన్న॥
తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే
యెల్లగాఁ బుట్టించి పెంచే యేలి కీతఁడే
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము
కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో
॥ఉన్న॥

[1] ‘సాళంగనాట’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము