Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-2
సంపుటము: 1-442
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
కలిగినది యొక్కటే కమలాపతి సేవ
తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను
॥కలిగి॥
హరియే పరతత్వ మతఁ డొక్కఁడే గతి
ధరలోన దేవతలెందరైనాఁ గలుగనీ
మురహరనామము ముంచి యొక్కటే యెక్కుడు
యిరవైన మంత్రము లెన్నియైనా నుండనీ
॥కలిగి॥
గోవిందుదాసులే పెక్కువఘను లిందరిలో
వేవేలు పెద్ద లటు వేలసంఖ్య లుండనీ
కైవసపు విష్ణుకైంకర్యమే సాధనము
యీవలనావల పుణ్య మెంతైనాఁ గలుగనీ
॥కలిగి॥
పట్టిన శ్రీవేంకటేశు భక్తి యొక్కటే ఘనము
యిట్టే శాస్త్రజ్ఞాన మెట్లున్నాను
వొట్టిన యాతని ముద్ర [1]లొక్కటికి మూలము
యెట్టిలాంఛనము లిల నెన్నియైనా నుండనీ
॥కలిగి॥

[1] ‘లొక్కటే’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము