అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-4
సంపుటము: 1-444
రేకు: 90-4
సంపుటము: 1-444
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము శ్రీతరుణీపతి మాయాధవుఁడు [1]సృష్టి యింతయును హరిమూలము | ॥ఆతనినే॥ |
| కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁ దామే ఆ రీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేల సారెకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము | ॥ఆతనినే॥ |
| కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము [2]అందుకది యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు కమ్మి అంతర్యామి కల్పితంబు లివి కాదన నవునన రాదెవ్వరికి సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి [3]నిజదాస్యము | ॥ఆతనినే॥ |
| సరి నెఱఁగుదుమా పోయిన జన్మము సారెకు నేమేమిచేసితిమో యిరవుగ నట్లా మీదఁటి జన్మము యెఱుకలు మఱపులు యిఁకనేలా నిరతమై శ్రీవేంకటేశుఁడు తన యిచ్చ నిర్మించిన దిది యీదేహము గరిమెల నాతని కైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి | ॥ఆతనినే॥ |
[1] ‘సిష్టి’ రేకు.
[2] ‘దానికది’ అని అర్థము కావచ్చు.
[3] నిజ = తనయొక్క (అతనియొక్క).


