Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 90-5
సంపుటము: 1-445
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
దైవమ నీవే గతి మా తప్పులు పనిలేదు
శ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే
॥దైవమ॥
[1]జనని నీమాయా, జనకుఁడవు నీవు,
జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము
వొనరెడి దినభోగములు వూరేటి చనుబాలు
మునుకొను మా నడవళ్లివి ముద్దులు మీ కివివో
॥దైవమ॥
ధరఁ బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులు
వురుటగు మా దేహంబులు వుయ్యలతొట్టెలలు
మరిగిన సంసారము బొమ్మరిండ్లయాట లివి
నిరతి మా యజ్ఞానంబు నీకే నవ్వులయ్యా
॥దైవమ॥
చావులుఁ బుట్టుగులాడెడి సరి దాగిలిముచ్చిములు
భావపు టారంభంబులు బాలలీలగతులు
కైవశమందఁగ శ్రీవేంకటపతి నీ దాస్యం బిది
మావంటివారికెల్లను నీ మన్ననలాలనలు
॥దైవమ॥

[1] ‘జనని నీ మాయాజనకుఁడవు’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము