Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 91-4
సంపుటము: 1-450
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
కలది గలట్టే కర్మఫలంబులు
నిలిపితిమా నేము నిమ్మకుఁ బులుసు
॥కలది॥
యెంత సేసినా యిహమున జీవికి
చెంత నజుఁడు వ్రాసిన కొలఁదే
వంతల ముంటికి వాఁడి వెట్టితిమా
కొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా
॥కలది॥
ఘనముగ బుద్ధులు గఱపిన దేహికి
మును నోఁచిన నోముఫలంబే
నినుపుఁ [1]దెంకాయకు నీరు నించితిమా
వొనర వేమునఁ జేఁదు నించితిమా
॥కలది॥
యిరవుగ శ్రీవేంకటేశుఁ డేప్రాణికి
కెరలి భాగ్య మొసఁగిన యంతే
మరువమునకు బరిమళము సేసితిమా
పెరిగేటి యడవులు పెంచితిమా
॥కలది॥

[1] ‘టెంకాయ’ పూ.ము.పా. ‘తెన్ +కాయ’ అను సహజవ్యుత్పత్తికి రేకు అనుకూలము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము