అధ్యాత్మ సంకీర్తన
రేకు: 91-6
సంపుటము: 1-452
రేకు: 91-6
సంపుటము: 1-452
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి అండదేహమం దొకటి ఆతుమలో నొకటి | ॥రెండు॥ |
| యిదివో [1]రసబద్ధము, యింద్రియములు మేనిలో పదిలముగా నిలిపి బంధించుట అదివో వేధాముఖ, మంతరంగపు మనసు చెదరకుండాఁ జొనిపి శ్రీహరిఁ దలఁచుట | ॥రెండు॥ |
| తారవిద్య గంటిమి; తగిలి నాసాగ్రమందు మేరతో ద్రిష్టినిలిపి మేలుఁ బొందుట చేరువ సువర్ణవిద్య, చిత్తములోఁ బ్రణవము ధీరత నాదము సేసిఁ దేవునిఁ బొగడుట | ॥రెండు॥ |
| పుట జయమాయ; నిట్టె పుణ్యపాపము లందులో కుటిలపుఁ గోరికల కొన దుంచుట యిటులనే శ్రీవేంకటేశుఁ డిందిరయును అటు [2]ప్రకృతిపురుషులనుటొరవచ్చుట | ॥రెండు॥ |
[1] ‘రసబంధము’ కావచ్చు.
[2] ప్రకృతిపురుషులు + అనుట + ఒరవచ్చుట.


