Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 92-2
సంపుటము: 1-454
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
అంగనలాల మనచే నాడించుకొనెఁ గాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే
॥అంగన॥
వొడలులేనివాని [1]కొక్కఁడే తండ్రాయఁ గాని
తడయక పురుషోత్తముఁ డితఁడే
బడబాగ్నిజలధికిఁ బాయ కల్లుఁడాయఁ గాని
వెడలించె నమృతము విష్ణుఁ డితడే
॥అంగన॥
పులిగూడుదిన్నవాని పొందొక్కటే సేసెఁ గాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివాని సరుస బావాయఁ గాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే
॥అంగన॥
యెక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁ గాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁ గాని
తక్కక వేదము చెప్పే దైవమీతఁడే
॥అంగన॥

[1] ‘కొక్కటే’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము