అధ్యాత్మ సంకీర్తన
రేకు: 92-3
సంపుటము: 1-455
రేకు: 92-3
సంపుటము: 1-455
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నీ వేలికవు మాకు; నీ దాసులము నేము ఆవల నితరుల నే మడుగఁబొయ్యేమా | ॥నీ వేలిక॥ |
| పసురమై వుండి యిచ్చీఁ బక్కనఁ గామధేనువు యెసఁగి మానై వుండి యిచ్చీఁ గల్పవృక్షము వెస రాయైవుండి యిచ్చీ వేడుకఁ జింతామణి మసలని శ్రీపతివి మాకు నిచ్చే దరుదా | ॥నీ వేలిక॥ |
| గాలి యావటించి యిచ్చీఁ గారుమేఘము మింట వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కుని బొంత కాలిన పెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ మైలలేని శ్రీపతివి మాకు నిచ్చు టరుదా | ॥నీ వేలిక॥ |
| అండనే కామధేనువ నాశ్రితచింతామణివి పండిన కల్పకమవు భక్తులకెల్లా నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి దండిగా నమ్మితే నీవు దయఁజూచు టరుదా | ॥నీ వేలిక॥ |


