Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 92-4
సంపుటము: 1-456
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
అక్కర కొదగనియట్టి యర్థము
లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే
॥అక్కర॥
దండితోఁ దనకుఁ గాని ధరణీశు రాజ్యంబు
యెండెనేమి యది పండెనేమిరే
బెండుపడఁ గేశవునిఁ బేరుకొనని నాలికె
వుండెనేమి వుండకుండెనేమిరే
॥అక్కర॥
యెదిరిఁ దన్నుఁ గానని యెడపుల గుడ్డికన్ను
మొదలఁ దెఱచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతిసేవ వేడుకఁ జేయనివాఁడు
చదివెనేమి చదువు చాలించెనేమిరే
॥అక్కర॥
ఆవల నెవ్వరులేని అడవిలోని వెన్నెల
కావిరిఁ గాసెనేమి కాయకున్ననేమిరే
శ్రీవేంకటేశ్వరుఁ జేరని ధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలఁగినేమిరే
॥అక్కర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము