Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 93-2
సంపుటము: 1-460
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
[1]పొడవైన శేషగిరి బోయనాయఁడు
విడువ కిందరిఁ గాచు వెడబోయనాయఁడు
॥పొడవైన॥
పొలసి మీసాల పెద్దబోయనాయఁడు
మలిగి వీఁపునఁ గట్టే మంకుబోయనాయఁడు
పొలమురాజై [2]తిరిగే బోయనాయఁడు
వెలయ [3]మోటుననుండే వేఁటబోయనాయఁడు
॥పొడవైన॥
పొట్టిపొట్టియడుగుల బోయనాయఁడు యెందుఁ
బుట్టుపగసాధించే బోయనాయఁడు
బొట్టులమెకము నేసే బోయనాయఁడు
పట్టపునెమలిచుంగు బలుబోయనాయఁడు
॥పొడవైన॥
పొంచి శిగ్గెగ్గెఱఁగని బోయనాయఁడు
మించి రాలమీఁద దాఁటే మెండుబోయనాయఁడు
అంచెల శ్రీవేంకటేశుడనే బోయనాయఁడు
పంచఁ గాలవేలముల బలుబోయనాయఁడు
॥పొడవైన॥

[1] ఇందు దశావతార సమన్వయము గలదు.

[2] ‘తిరిగీ’ పూ.ము.పా.

[3] మోటు = స్తంభమా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము