Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 93-3
సంపుటము: 1-461
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
[1]వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులునేల
పుడమిధరుఁడు మాఁకు భువనౌషధము
॥వెడ॥
హరి యచ్యుతా యంటే నణఁగుఁ బాపములు
నరసింహాయని యంటే నాఁటిన దుఃఖములు మాను
పురుషోత్తమా యంటేఁ బుండ్లు బూచులు మాను
పరమౌషధ మీతఁడే పాటింప మాకు
॥వెడ॥
వాసుదేవయని యంటే వదలు బంధములెల్లా
వాసికిఁ గృష్ణా యంటే వంతలరోగాలు మాను
శ్రీసతీశయని యంటే చింతలిన్నియును మాను
గాసిదీర నితఁడేపో ఘనదివ్యౌషధము
॥వెడ॥
గోవిందాయని యంటేఁ గూడును సంపదలు
యీవల మాధవ యంటే నిహముఁ బరముఁ జేరు
దేవ నారాయణ యంటే దేహము సుఖియై యుండు
శ్రీవేంకటేశుఁడే మాకు సిద్ధౌషధము
॥వెడ॥

[1] ‘వేదమంత్ర’ పూ.ము.పా. ప్రాసభంగము. గురుపూర్వ లఘుపూర్వ పాదకల్పన.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము