Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 93-5
సంపుటము: 1-463
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
సర్వజ్ఞత్వము వెదకఁగ నొల్లను సందేహింపఁగ నొల్లను
సర్వజ్ఞుండును నాచార్యుండే సర్వశేషమే నా జీవనము
॥సర్వజ్ఞ॥
యెఱఁగఁగ నొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటు [1]సోదించి
యెఱిఁగి యితరులను బోధించెదమను యీపెద్దరికము నొల్లము
యెఱిఁగేటివాడును యాచార్యుండే, యెఱుకయు సర్వేశ్వరుఁడే
యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మా విజ్ఞానము
॥సర్వజ్ఞ॥
చదువఁగ నొల్లము సకలశాస్త్రములు సారెకు సారెకు [2]సోదించి
చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగ నొల్లము
చదివేటివాఁడును నాచార్యుండే, చదువును నా యంతర్యామే
చదువుకుఁ జదువమికియు దొలఁగుటే నానాసాత్వికభావమే నా తెలివి
॥సర్వజ్ఞ॥
అన్నిటికిని నే నధికారిననెడి యహంకారము నొల్లను
కన్నుల జూచుచు [3]నందరితో నేఁ గాదని తొలఁగానొల్లను
మన్నన శ్రీవేంకటేశ్వరు కరుణను మా యాచార్యుఁడే అధికారి
వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నా తలఁపు
॥సర్వజ్ఞ॥

[1][2] ‘సోధించి’ రేకు పూ.ము.పా.

[3] ‘నందరితోనేఁ గాదని’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము