Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 94-3
సంపుటము: 1-467
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
చీ చీ వోబదుకా సిగ్గులేని బదుకా
వాచవికి బతిమాలి వడఁబడ్డ బదుకా
॥చీ చీ॥
ఆసలకుఁ జోటు గద్దు అంతరంగాన నెంతైన
వీసమంతాఁ జోటు లేదు విరతికిని
యీసున సంసారమున కెందరైనాఁ గలరు
వోసరించి మోక్షమియ్య నొకరు లేరు
॥చీ చీ॥
భోగించ వేళ గద్దు పొద్దువొడపుఁ గుంకును
వేగమే హరిఁ దలచ వేళలేదు
వోగుల లంపటమున కోపికెంతైనాఁ గద్దు
యోగపు సత్కర్మాన కొకయింత లేదు
॥చీ చీ॥
యెదుట ప్రపంచాన కెఱుకెంతైనాఁ గద్దు
యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు
మది శ్రీవేంకటేశుఁడు మమ్ము నిట్టె కాచెఁ గాని
ఎదరి నా నేరములు పాప మఱి లేరు
॥చీ చీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము