అధ్యాత్మ సంకీర్తన
రేకు: 95-2
సంపుటము: 1-472
రేకు: 95-2
సంపుటము: 1-472
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ఎవ్వరివాఁడో యెఱఁగరాదు అవ్వలివ్వలి జీవుఁ డాటలో పతిమే | ॥ఎవ్వరి॥ |
| ధర జనించక తొలుత తనుఁ గానరాదు మరణమందిన వెనక మఱి కానరాదు వురువడి దేహముతో నుండినయన్నాళ్లే మరలు జీవునిబదుకు మాయవో చూడ | ॥ఎవ్వరి॥ |
| యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు | ॥ఎవ్వరి॥ |
| సంతానరూపమై సాగు ముందరికి కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు యింతటికి శ్రీవేంకటేశుఁ డంతర్యామి బంతి నితనిఁ గన్న బదుకువో బదుకు | ॥ఎవ్వరి॥ |


