అధ్యాత్మ సంకీర్తన
రేకు: 95-5
సంపుటము: 1-475
రేకు: 95-5
సంపుటము: 1-475
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఏమి సేసినా నీ రుణ మెట్టు వాసును కామితఫలద వో కరుణానిధి | ॥ఏమి॥ |
| చేరి కర్మములు నన్ను చెఱవట్టుకుండఁగాను పేరువాడి వచ్చి విడిపించుకొంటివి సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా నారయ దీనులఁ గంటే నడ్డమై కాతురు | ॥ఏమి॥ |
| అరులు పంచేంద్రియము లందు నిందు దియ్యఁగాను వెరవుతోడ వెనక వేసుకొంటివి పరగ నట్టేకాదా బలువులైనవారు అరయఁ బేదలకైన ఆపద మానుతురు | ॥ఏమి॥ |
| పలుజన్మములే నన్ను పరి అరికట్టుకోఁగా తొలగఁదోసి నాకు దోడైతివి యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు బలుభయ మిందరికిఁ బాపుచుందురు | ॥ఏమి॥ |


