Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 96-2
సంపుటము: 1-478
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
అల వటపత్రశాయివైన రూప మిట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందరాజా
॥అల॥
పడఁతులిద్దరిమీద బాదములు చాఁచుకొని
వొడికపు రాజసాన నొత్తగిలి
కడలే నిజనాభికమలమున బ్రహ్మను
కొడుకుఁగా గంటి విదె గోవిందరాజా
॥అల॥
సిరుల సొమ్ములతోడ శేషునిపైఁ బవళించి
సొరిది దాసులఁ గృపఁ జూచుకొంటాను
పరగు దైత్యులమీఁద పామువిషములే నీవు
కురియించితివిగా గోవిందరాజా
॥అల॥
శంకుఁజక్రములతోడఁ జాఁచిన కరముతోడ
అంకెల శిరసు కింది హస్తముతోడ
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా
॥అల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము