Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 96-4
సంపుటము: 1-480
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
అరుదరుదు నీమాయ హరిహరీ
అరసి తెలియరాదు హరిహరీ
॥అరుద॥
అనంతబ్రహ్మాండము లవె రోమకూపముల
అనంతములై వున్నవి హరిహరీ
పొనిగి కుంగిన వొక్క భూమి నీ వెత్తినది యే-
మని నుతింతు నిన్ను హరి హరీ
॥అరుద॥
పొదిగి బ్రహ్మాదులు నీ బొడ్డున నేకాలము
అదివో పుట్టుచున్నారు హరిహరీ
పొదలి యీ జీవులను పుట్టించే యీ సామర్థ్యము
అదన నేమనిచెప్పే హరి హరీ
॥అరుద॥
పావనవైకుంఠము నీ పాదమూల మందున్నది
ఆవహించే భక్తిచేత హరి హరీ
శ్రీవేంకటాద్రిమీఁద చేరి నీ విట్టె వుండఁగా-
నావల వెదకనేల హరిహరీ
॥అరుద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము