Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-4
సంపుటము: 1-486
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఇరవైనయట్టుండు [1]యెఱఁగనీ దీమాయ
తెరమఱఁగుమెకమువలె తిరుగు నీబ్రదుకు
॥ఇరవైన॥
అనిశమును దేహమున కన్నపానము లిడిన
యినుము గుడిచిన నీరు యెందుకెక్కినదో
గొనకొన్న మానినుల కూటముల సుఖములివి
మనసు దాగిన పాలు మట్టు లేదెపుడు
॥ఇరవైన॥
వొడలఁ బెట్టిన సొమ్ము లొగిఁ దనకుఁ గానరా-
వడవిఁ గాసిన వెన్నె లది కన్నులకును
వుడివోని పరిమళము లొకనిమిషమాత్రమే
బెడిదంపు భ్రమతోడి పెనుగాలి మూఁట
॥ఇరవైన॥
చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు
యెద్దు యెనుపోతునై యేకంబు గాదు
వొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలో
అద్దంపు నీడవలె నాత్మఁ బొడచూపె
॥ఇరవైన॥

[1] ‘యెఱగని దీమాయ’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము