Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 97-5
సంపుటము: 1-487
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు
భావించలేనివారి పాప మింతే కాని
॥నీవేమి॥
పరమపద మొసఁగి పాపమడఁచేనని
చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె
నిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదు
పరగ నమ్మనివారి పాప మింతేకాని
॥నీవేమి॥
నీ పాదములకు నాకు నెయ్యమైన [1]లంకెని
యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత
దాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచి
పైపై నమ్మనివారి పాప మింతే కాని
॥నీవేమి॥
బంతిఁ బురాణములను భక్తసులభుఁడ నని
అంతరాత్మ వీమాట ఆడితివి తొలుతనే
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు
పంతాన నమ్మనివారి పాప మింతేకాని
॥నీవేమి॥

[1] ‘లంకె + అని.’ ‘లంకని’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము