Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 98-2
సంపుటము: 1-490
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
నెరవాది సాహసులు నిత్యశూరులు
దురితవిదూరులు ధ్రువాదులు
॥నెరవాది॥
తక్కక శ్రీహరిభక్తి తా పలు సేసి యెక్కిరి
చక్కఁగా వైకుంఠము సనకాదులు
వొక్కట విష్ణుకథలు వోడ సేసుక దాఁటిరి
పెక్కుసంసారజలధి భీష్మాదులు
॥నెరవాది॥
కడు విరక్తియనేటి కత్తులనే నరకిరి
నడుమ భవపాశముల నారదాదులు
బడినే హరిదాసుల పౌఁజుల గూడుకొనిరి
నుడివడ కిహమందే శుకాదులు
॥నెరవాది॥
పరమశాంతములనే పట్టపేనుగులమీద
వరుసల నేఁగేరు వ్యాసాదులు
సిరుల శ్రీవేంకటేశుఁ జేరి సుఖముఁ బొందిరి
బెరసి దాస్యమున విభీషణాదులు
॥నెరవాది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము