Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 100-1
సంపుటము: 1-501
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
శతాపరాధములు సహస్రదండన లేదు
గతి నీవని వుండఁగ కావకుండరాదు
॥శతాపరాధ॥
తలఁచి నీకు మొక్కఁగా దయఁ జూడకుండరాదు
కొలిచి బంటననఁగా కోపించరాదు
నిలిచి [1]భయస్తుఁడనై నీ యెదుట దైన్యమే
పలుకఁగఁ గావకుండఁ బాడిగాదు నీకు
॥శతాపరాధ॥
శరణు చొరఁగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు
సరిఁ బూరి గరవఁగ చంపరాదు
అరయ జగద్రోహినౌదు నైనా నీ నామము
గరిమె నుచ్చరించఁగఁ గరఁగక పోదు
॥శతాపరాధ॥
దిక్కు నీవని నమ్మఁగా దిగవిడువఁగ రాదు
యెక్కువ నీ లెంకఁ గాఁగా యేమనరాదు
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లాఁ జేసి వచ్చి
యిక్కడ నీ దాసినైతి నింకఁ దోయరాదు
॥శతాపరాధ॥

[1] ‘భయహస్తుఁడ’ పూ.ము.పా. భయస్థుఁడు, భయస్తుఁడు = భయముగలవాడని వ్యవహారము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము