అధ్యాత్మ సంకీర్తన
రేకు: 100-2
సంపుటము: 1-502
రేకు: 100-2
సంపుటము: 1-502
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి | ॥ఎదుట॥ |
| ముంచిన నారాయణమూర్తులే యీ జగమెల్ల అంచితనామములే యీ యక్షరాలెల్లా పంచుకొన్న శ్రీహరిప్రసాద మీ రుచులెల్లా తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి | ॥ఎదుట॥ |
| చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే భారపు యీ [1]భూమెతని పాదరేణువే సారపుఁ గర్మములు కేశవుని కైంకర్యములే ధీరులై వివేకించి తెలిసేటివారికి | ॥ఎదుట॥ |
| చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే హత్తిన ప్రకృతి [2]యెల్లా నాతని మాయే మత్తిలి యీతనికంటే మరి లే దితరములు తిత్తిదేహపు బ్రదుకు తెలిసేటివారికి | ॥ఎదుట॥ |
[1] ‘భూమితని’ పూ.ము.పా. ‘భూమి + అతని’ ఇట్టి సంధు లీవాఙ్మయమున కొల్లలు.
[2] ‘యల్లా’ రేకు.


