Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 100-3
సంపుటము: 1-503
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఏల మోసపోయిరొకో యెంచి యా కాలపువారు
బాలకృష్ణుని బంట్లై బ్రదుకవద్దా
॥ఏల॥
పసులఁ గాచేవాని బ్రహ్మ నుతించెనంటేను
దెసల దేవుఁడేయని తెలియవద్దా
సిసువు గోవర్ధనాద్రి చేతఁ బట్టి యెత్తెనంటే
కొస రీతని పాదాలే కొలువవద్దా
॥ఏల॥
నరునికి విశ్వరూ పున్నతిఁ జూపెనంటేను
నరహరి యితఁడని నమ్మవద్దా
పరగఁ జక్రముచేత బాణుని నఱకెనంటే
సొరి దీతని శరణు చొఱవద్దా
॥ఏల॥
అందరు సురలలోన నగ్రపూజ గొన్నప్పుడే
చెంది యీతని కృపకుఁ జేరవద్దా
అంది శ్రీవేంకటేశుఁ డట్టె ద్రిష్టదైవమంటే
విందులఁ బరుల సేవ విడువవద్దా
॥ఏల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము