Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 100-6
సంపుటము: 1-506
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
మొఱవెట్టెదము మీకు మొగసాలవాకిటను
మఱఁగు చొచ్చితి మీకు మముఁ గావరో
॥మొఱ॥
యేపున మనసనియేటి మా పెంపుడు [1]లేడు
పాపమనే యడవిఁ బడినది
రాపున హరికింకరపు వేఁకకాండ్లాల
పైపైని మా కింక బట్టియ్యరో
॥మొఱ॥
అంచెల మా విజ్ఞానమనెడి కామధేనువు
పంచేంద్రియపు రొంపిఁ బడినది
మించి వైకుంఠాన కేఁగే మేటి తెరువరులాల
దించక యెత్తెత్తి వెళ్లఁదియ్యరో
॥మొఱ॥
అండనే మోహాంధకారమనెడి మా దిగ్గజము
దండి మీ[2]దయనేటివోఁ దానఁ బడెను
నిండి శ్రీవేంకటేశుఁడనేటి మావటీనిచేత
గండి కర్మపు కంభానఁ గట్టించరో
॥మొఱ॥

[1] ‘లేడి’ కావచ్చు.

[2] ‘దయ యనేటి’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము