Display:
అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-2
సంపుటము: 1-508
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
[1]ఇందుకే కాఁబోలు నీవు యిట్టే యవధరించేవు
కందువ లన్నియు నీమై గనియైనట్లుండె
॥ఇందుకే॥
హరి నీవు కప్పురకా పవధరించేవేళ
విరివిగా నిందరు భావించి చూచితే
తరుణుల నవ్వులెల్లా దట్టమై నీమేనిమీఁద
పెరిగి పెరిగి యట్టే పేరినయట్లుండె
॥ఇందుకే॥
భువనేశ నీవు తట్టుపుణుఁగు చాఁతుకొనఁగ
యివల నీదాసులెల్లా నెంచి చూచితే
కవగూడి నీసతుల కనుచూపులెల్లాను
తివిరి నీమేనిమీఁద తిరమైనట్లుండె
॥ఇందుకే॥
శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో
తావున మెరసేది నేఁ దలఁచితేను
కోవరపు గొల్లెతల గుబ్బల కుంకుమ నిగ్గు
వేవేలయి నీయం దచ్చువేసినయట్టుండె
॥ఇందుకే॥

[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము