Display:
అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-3
సంపుటము: 1-509
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
[1]చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ
యేతులే బూమెల్లా నిండె నీదేవదేవునికి
॥చేతులెత్తి॥
తతికొని పన్నీటధారలు పైనించి నించి
సతముగాఁ బెద్దలు మజ్జన మార్చఁగా
అతివల చనుఁగొండ లంగము లొత్తినందుకు
యితవులై తోఁచె నేఁడు యిందిరాపతికి
॥చేతులెత్తి॥
కప్పురపు ధూళి మేనఁ గలయఁగ గంపెఁడేసి
నెప్పున సందుసందుల నిగిడించఁగా
చొప్పులెత్తి గొల్లెతల చూపులు దాఁకిన కుమ్మె-
లప్పు డన్నియునుఁ గప్పె నందువల్ల హరికి
॥చేతులెత్తి॥
తట్టుపుణుఁ గలఁది యందపు టలమేలుమంగ-
నట్టే వురముమీఁద నమరించఁగా
నెట్టనఁ బచ్చిసేసిన నెలతఁల చేఁతలలో
చిట్టకములెల్లాఁ గప్పె శ్రీవేంకటపతికి
॥చేతులెత్తి॥

[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము