అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-4
సంపుటము: 1-510
శ్రీరంగం రేకు: 98-4
సంపుటము: 1-510
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| [1]ముగురు వేలుపులకు మూలమితఁడు జిగి మీరి నెదుటను సేవించరే | ॥ముగురు॥ |
| అంచలఁ బన్నీటిబిందె లందుకొని యిందరును నించి మజ్జనము దేవునికిఁ జేయఁగా వంచి సముద్రముమీఁద వానలు గురిసినట్టు పొంచి యన్నిటాను ఉప్పొంగుచున్నాఁడు | ॥ముగురు॥ |
| పచ్చకప్పురము మేనఁ బలుమారు మెత్తఁగాను తచ్చి పున్నమచంద్రుఁడే తానై వున్నాఁడు అచ్చపుఁ దట్టుపుణుఁగు ఆమీఁదఁ బుయ్యఁగాను నిచ్చఁ గల్పకతరువు నీడయై వున్నాఁడు | ॥ముగురు॥ |
| అలమేలుమంగతోడ నన్నిసొమ్ములు నించఁగా పలువన్నెలసంపద యైనాఁడు యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నిటాఁ బ్రతాపించి కులికి పుణ్యాలకెల్లా గురియైనాఁడు | ॥ముగురు॥ |
[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.


