Display:
అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-5
సంపుటము: 1-511
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
[1]మహిమెల్లా దొప్పఁ దోఁగె మజ్జనవేళ
సహజశృంగారాలు జడిసె శ్రీపతికి
॥మహిమెల్లా॥
ముత్తేలవానలెల్ల ముంచి కురిసినయట్టు
హత్తి పన్నీటి జలకమాయ హరికి
తత్తరానఁ దెల్లమెయిలు తనుఁ బొదిగినయట్లు
కొత్తగాఁ గప్పురకాపు గుప్పిరి దేవునికి
॥మహిమెల్లా॥
నీలపుఁ బేరులెల్లా నిండాఁ గట్టినయట్టు
తేలఁ దట్టుపుణుఁగు మెత్తిరి పతికి
అలరి మెఱఁగుదీగె లలముకొనినయట్టు
కోలు ముందై సొమ్ములెల్లా గుప్పిరి విష్ణునికి
॥మహిమెల్లా॥
పెక్కు నవరత్నములు పెద్దరాశి పొసినట్టు
యెక్కువ దండలు గట్టిరి మూరితికి
వొక్కట నలమేలుమంగ నురమునఁ గట్టిరిదె
చిక్కని నవ్వులు మించె శ్రీవేంకటేశునకు
॥మహిమెల్లా॥

[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము