అధ్యాత్మ సంకీర్తన
రేకు: 101-3
సంపుటము: 2-3
రేకు: 101-3
సంపుటము: 2-3
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| దొరకె మాపాలికిఁ గందువయర్థము దరిదాపై యుండిన తత్త్వార్థము | ॥పల్లవి॥ |
| తిరముగ నల్లదీవిఁ దెచ్చిన యర్థమిదివో విరజవోడరేవున వెళ్లినర్థము పరమభాగవతులు పాఁతినర్థమిదివో పురుషోత్తముఁడనేటి పురుషార్థము | ॥దొర॥ |
| చందపువేదముల(లు ? ) శాసనము వేసినర్థము ముందు సుముద్రల కెల్లా మొదలర్థము అందరి యాత్మలనేటి అంగళ్లలోనియర్థము యెందు సహస్రనామపు టెన్నికర్థము | ॥దొర॥ |
| కొలచి బ్రహ్మాండముల కొప్పెరలో నర్థము యిల నిహపరముల కెక్కినర్థము యెలమి హీనునినై న యెక్కుడుసేసే యర్థము అలరి శ్రీవేంకటేశుఁడై న యర్థము | ॥దొర॥ |


