Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 104-1
సంపుటము: 2-19
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బదుకు ఘనునికిని
॥పల్లవి॥
అనయము సుఖమేడ దవల దుఃఖమేడది
తనువుపై నాసలేని తత్త్వమతికి
పొనిఁగితేఁ బాపమేది పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లని యోగికిని
॥తెలి॥
తగిన యమృతమేది తలఁపఁగ విషమేది
తెగి నిరాహారియైన ధీరునికిని
పగవారనఁగ వేరి బంధులనఁగ వేరీ
వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి
॥తెలి॥
వేవేలువిధులందు వెఱుపేది మఱుపేది
దైవము నమ్మినయట్టి ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవాడు
యీవలేది యావలేది యితనిదాసునికి
॥తెలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము