Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 104-2
సంపుటము: 2-20
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది
శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము
॥పల్లవి॥
అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
తనువిధి మలమూత్రములప్రోగు
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది
॥నీదా॥
చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా
పొదలిన మతముల పోరాట మది
మదిమది నుండిన నామనసే నమ్మితినా
అదియును నింద్రియాల కమ్ముడువోయినది
॥నీదా॥
పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
పాత్రమగు రుణానుబంధము లవి
చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే
పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు
॥నీదా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము