Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 104-6
సంపుటము: 2-24
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే
॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ
॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ
॥శర॥
సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా
॥శర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము