Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 105-1
సంపుటము: 2-25
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
అదివో నిత్యశూ(సూ?)రులు అచ్యుత నీదాసులు
యెదురులేనివారు యేకాంగవీరులు
॥పల్లవి॥
రచ్చల సంసారమనే రణరంగములోన
తచ్చి కామక్రోధాల తలలు గొట్టి
అచ్చపు తిరుమంత్రపు టారుపుబొబ్బలతోడ
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు
॥అది॥
మొరసి పట్టుగులనే ముచ్చుఁబౌఁజుల కురికి
తెరలి నడుములకుఁ దెగవేసి
పొరిఁ గర్మముఁ బొడిచి పోటుగంటులఁ దూరి
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు
॥అది॥
వొడ్డిన దేహములనే వూళ్లలోపల చొచ్చి
చెడ్డ యహంకారమను చెఱలువట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నండనుండి లోకులనే-
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు
॥అది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము