Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 105-3
సంపుటము: 2-27
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
సంతలే చొచ్చితిఁగాని సరకుఁ గాననైతి
యింతట శ్రీహరి నీవే యిటు దయఁజూడవే
॥పల్లవి॥
కాంత చనుఁగొండలు కడకు నెక్కితిఁ గాని
యెంతైనా నా మోక్షపుమెట్లు యెక్కలేనైతి
అంతట జవ్వనమనే ‌అడవి చొచ్చితిఁ గాని
సంతతహరిభక్తెనే సంజీవి గాననైతి
॥సంత॥
తెగి సంసారజలఁధిఁ దిరుగులాడితిఁ గాని
అగడై వైరాగ్యరత్న మది దేనైతి
పొగరు జన్మాల రణభూములు చొచ్చితిఁగాని
పగటుఁ గామాదుల పగ సాధించనైతి
॥సంత॥
తనువనియెడి కల్పతరువు యెక్కితిఁ గాని
కొన విజ్ఞానఫలము గోయలేనైతి
ఘనుఁడ శ్రీవేంకటేశ కమ్మర నీకృపచేతఁ
దనిసి యేవిధులనుఁ దట్టువడనైతి
॥సంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము