Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 106-3
సంపుటము: 2-33
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
అయ్యో వారిభాగ్య మంతేకాక
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు
॥పల్లవి॥
దేవుఁడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండఁగా
సోవల నాస్తికునకు శూన్యమై తోఁచు
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా
కావరపు జీవునకు గతుగతుకే
॥అయ్యో॥
హరి శరణంటేఁ గాచే‌ అట్టియుపాయమే వుండఁగ
విరసానకుఁ గర్మమే వెగ్గళమాయ
పరగ నరులకెల్లాఁ బట్టపగలై యుండఁగా
అరయఁ గొన్ని జంతుల కంధకారమాయను
॥అయ్యో॥
యిక్కడ శ్రీవేంకటేశుఁ డెదుటనే వుండఁగాను
అక్కటా మూఢున కెందు ననుమానమే
మక్కువ నింతా నమృతమయమైనఁ గోడికి
తెక్కులఁ దవ్వఁ బొయ్యేది తిప్పపెంటలే
॥అయ్యో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము