Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 107-1
సంపుటము: 2-37
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
ఆ మీఁది నిజసుఖ మరయలేము
పామరపు చాయలకే భ్రమసితిమయ్యా
॥పల్లవి॥
మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా
॥ఆమీఁ॥
బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మనందు కిందుమీఁదు నేఱక
పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా
॥ఆమీఁ॥
బాలులు యిసుకగుళ్లు పఁస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాఁడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా
॥ఆమీఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము