Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 107-5
సంపుటము: 2-41
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
॥పల్లవి॥
వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి
॥అతి॥
తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి
॥అతి॥
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి
॥అతి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము