అధ్యాత్మ సంకీర్తన
రేకు: 109-5
సంపుటము: 2-53
రేకు: 109-5
సంపుటము: 2-53
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| పురుషోత్తముఁడ నీవు పురుషాధముఁడ నేను ధరలో నాయందు మంచితన మేది | ॥పల్లవి॥ |
| అనంతాపరాధములు అటు నేము సేసేవి అనంతమయిన దయ అది నీది నిను నెఱఁగకుండేటి నీచుగుణము నాది నను నెడయకుండే గుణము నీది | ॥పురు॥ |
| సకలయాచకమే సరుస నాకుఁ బని సకలరక్షకత్వము సరి నీపని ప్రకటించి నిన్ను దూరేపలుకే నాకెప్పుడూను వెకలివై ననుఁ గాచేవిధము నీది | ॥పురు॥ |
| నేరమింతయును నాది నేరుపింతయును నీది సారెకు నజ్ఞాని నేను జ్ఞానివి నీవు యీరీతి శ్రీవేంకటేశ యిట్టే నన్ను నేలితివి ధారుణిలో నిండెను ప్రతాపము నీది | ॥పురు॥ |


