అధ్యాత్మ సంకీర్తన
రేకు: 110-1
సంపుటము: 2-55
రేకు: 110-1
సంపుటము: 2-55
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| లేదు భయము మఱి కాదు భవము ఆదియు నంత్యముఁ దెలిసిన హరియాజ్ఞే కాన | ॥పల్లవి॥ |
| తలఁపులు గడుగక వొడ లటు తాఁ గడిగిన నేమి వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమఁ గలిగిన యాతఁడు చెలఁగుచు పనులైనా సేసిన మరి యేమి | ॥లేదు॥ |
| పొంచినకోపము విడువక భోగము విడిచిననేమి పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి నించిన దైవము నమ్మిన నిర్భరుఁడయిన యాతఁడు యెంచుక యేవర్గంబుల నెట్టుండిన నేమి | ॥లేదు॥ |
| వేగమె లోపల గడువక వెలి గడిగిన నేమి యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి యీగతి శ్రీవేంకటపతి నెఱిఁగి సుఖించేటి యాతఁడు జాగుల ప్రపంచమందును సతమైనా నేమి | ॥లేదు॥ |


