Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 110-3
సంపుటము: 2-57
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఈతనిఁ గొలిచితేనే యిన్ని గొలలునుఁ దీరు
చేతనఁ బెట్టు పుణ్యాలు చేరువనే కలుగు
॥పల్లవి॥
పట్టి కాళింగునిఁ దోలి పాముకొల దీర్చినాఁడు
బట్టబాయిటనే రేపల్లెవారికి
అట్టె పూతనఁ జంపి ఆఁడుఁగొల దీర్చినాఁడు
గట్టిగాఁ గృష్ణుఁడు లోకమువారికెల్లను
॥ఈత॥
బలురావణుఁ జంపి బాఁపనకొల దీర్చినాఁడు
యిలమీఁదఁ గలిగిన‌ ఋషులకెల్లా
కొలఁది మీరినయట్టి కోఁతికొల దీర్చినాడు
సొలసి రాఘవుఁ డదె సుగ్రీవునికిని
॥ఈత॥
వొలిసి పురాలు చొచ్చి వూరఁగొల దీర్చినాఁడు
అల తనదాసులైన‌ అమరులకు
సిలుగుఁగొలలు దీర్చి సేన వరా లిచ్చినాఁడు
చెలఁగి పరుషలకు శ్రీవేంకటేశుఁడు
॥ఈత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము