అధ్యాత్మ సంకీర్తన
రేకు: 111-5
సంపుటము: 2-65
రేకు: 111-5
సంపుటము: 2-65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఈడనుండె నిందాఁకా నింటి ముంగిట ఆడ నెందుఁ బోఁడుగద అప్పుడే యీకృష్ణుఁడు | ॥పల్లవి॥ |
| యేడ పూతకిఁ జంపె నింతపిన్నవాఁడంటా ఆడుకొనేరదే వీథి నందరుఁ గూడి వేడుకతో మనగోవిందుఁడు గాఁడుగదా చూడరమ్మ వీఁడు గడు చుల్లరీఁడు పాపఁడు | ॥ఈడ॥ |
| మరలి యప్పటివాఁడె మద్దులు విఱిచెనంటా పరువులు వెట్టేరు పడఁతులెల్లా కరికరించఁగ రోలఁ గట్టితే నప్పుడు మా- హరి గాఁడుగదా ఆడనున్న బిడ్డఁడు | ॥ఈడ॥ |
| వింతగాఁగ నొకబండ విఱిచె నప్పటినంటా రంతు సేసేరదివో రచ్చలు నిండి అంత యీశ్రీవేంకటేశుఁడై న మనకృష్ణుఁడట యింతేకాక యెవ్వరున్నా రిటువంటి పాపఁడు | ॥ఈడ॥ |


