Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 112-1
సంపుటము: 2-67
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఏఁటిమాట లివి విన నింపయ్యీనా మది-
నేఁటవెట్టి దాసుఁడౌ టిదిసరియా
॥పల్లవి॥
జీవుఁడే దేవుఁడని చెప్పుదురు గొందరు
దైవముచేఁతలెల్లాఁ దమ కున్నవా
ఆవలఁ గొందరు కర్మ మది బ్రహ్మ మందురు
రావణాదు లవి సేసి రతికెక్కిరా
॥ఏఁటి॥
మిగులఁ గొందర దైవమే లేదనెందురు
తగ నీప్రపంచమెల్లాఁ దనచేఁతలా
గగన మతఁడు నిరాకార మందురు గొంద-
రెగువఁ బురుషసూక్త మెఱఁగరా తాము
॥ఏఁటి॥
యెనిమిది గుణములే యితని వందురు గొంద-
రనయము మిగిలిన వవి దమవా
యెనయఁగ శ్రీవేంకటేశ్వరుదాసులై
మనుట నిత్యముగాక మరి యేమినేలా
॥ఏఁటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము