Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 112-3
సంపుటము: 2-69
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
ఈహీ శ్రీహరిఁ గంటే యింత లేదుగా వట్టి-
దాహపుటాసల వెఱ్ఱి దవ్వు టింతే కాకా
॥పల్లవి॥
పలుమారు నిందరిని భంగపడి వేఁడేది
యిలపై దేహము వెంచేయిందు కింతేకా
కలికికాంతలచూపు ఘాతలకు భ్రమసేది
చెలఁగి మైమఱచేటి చేఁత కింతేకా
॥ఈహీ॥
పక్కన జన్మాలనెల్లాఁ బాటువడేదెల్లాను
యెక్కడోసంసారాన కిందు కింతేకా
వొక్కరిఁ గొలిచి తిట్టు కొడిగట్టేదెల్లాను
చక్కుముక్కు నాలికెపై చవి కింతేకా
॥ఈహీ॥
గారవాన ధనములు గడియించేదెల్లాను
ఆరయ నాదని వీఁగేయందు కింతేకా
చేరి శ్రీవేంకటపతి సేవకుఁ జొరనిదెల్లా
భారపుఁ గర్మపుబాధఁ బట్టువడికా
॥ఈహీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము