Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 112-6
సంపుటము: 2-72
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
సేయనివాఁ డెవ్వఁడు చేరి చిల్లరదోషాలు
యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే
॥పల్లవి॥
దేవుని నమ్మినయట్టి దేహియట యాతనికి
యీపల నెంతటిపాపమేమి సేసును
భావించి యన్ని నేరాలు పరిహరించు నతఁడే
ఆవటించు సూర్యునికి నంధకార మెదురా
॥సేయ॥
పూజింపించుకొనేవాఁడు భువనరక్షకుఁడట
తేజముతో దురితాలు తెంచఁగలేఁడా
రాజు సేసిన యాణాజ్ఞ రాజుకంటే నెక్కుడా
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు
॥సేయ॥
చేతనాత్మకుఁడట శ్రీవేంకటేశ్వరుఁడు
జాతిలేని జీవునికి స్వతంత్ర మేది
కాతరపు జన్మానకుఁ గార్యకారణ మేది
యేతున గరుడనికి నెదురా పాములు
॥సేయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము